IT Raids: రూ.800 కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో 3 రియల్ ఎస్టేట్ సంస్థల బ్లాక్ మనీ! వెల్లడించిన ఆదాయపన్ను శాఖ

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపార సంస్థల పై ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. గత వారం మూడు సంస్థల్లో జరిపిన ఈ దాడుల్లో వందల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. కేవలం ఈ మూడు కంపెనీల్లోనే దాదాపు రూ.800కోట్ల మేర లెక్కకురాని నగదు లావాదేవీలు గుర్తించినట్లు ఐటీ శాఖ సోమవారం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంతో సంబంధమున్న పలు సంస్థలకు చెందిన కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలతో పాటు ఇతర ప్రదేశాల్లో జనవరి 5న ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. కర్నూలు, అనంతపూర్, కడప, నంద్యాల, బళ్లారితో పాటు మొత్తం 24 చోట్ల ఈ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో రియల్ ఎస్టేట్ కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించి చేతిరాత, పుస్తకాలు, ఒప్పంద డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు పలురకాల ప్రత్యేక సాఫ్ట్ వేర్ లను సీజ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తాజా ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా లావాదేవీల్లో తేడాలు గుర్తించకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మార్పుచేసిన ఓ సాఫ్ట్ వేర్ ను ఓ సంస్థ వినియోగిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఆయా సంస్థలు వాస్తవ భూమి విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరిస్తూ... ఆ లెక్కలోకి రాని నగదుతో భూమి కొనుగోళ్లు, ఇతర ఖర్చులకు వాడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో రూ.1.64 కోట్ల లెక్కలోకి రాని నగదును సీజ్ చేయగా.. దాదాపు రూ.800 కోట్ల మేర ఇటువంటి లావాదేవీలు గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us