Kurnool CI : సీజ్ చేసిన డబ్బును దోచేసిన సీఐ సస్పెన్షన్.. అతని కోసం గాలింపులు

UPDATED 26th MARCH 2022 SATURDAY 03:00 PM

CI Kambagiri Ramudu : కర్నూలు అర్బన్ తాలుకాలో ఓ సీఐ పోలీసు శాఖకే మచ్చ తెచ్చిపెట్టాడు. బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఈ ఖాకీ.. సీజ్ చేసిన నగదును దోచేశాడు. ఏకంగా ఎస్పీ పేరు చెప్పి నగదును కాజేశాడు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో పరారయ్యాడు. పోలీసుల లంచగొడితనం ఎలా ఉందో ఈ ఘటనను చూస్తే అర్థమౌతోంది. అందినకాడికి దోచుకోవడం లేదా అక్రమాల్లో పట్టుబడిన సొమ్మును సైతం దోచేస్తున్నారు. ఈ సీఐ ఘటన సంచలనం సృష్టిస్తోంది. చివరకు ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడంతో డబ్బు తీసుకున్నది నిజమేనని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

అసలు ఏం జరిగింది ? ఎంత డబ్బు కొట్టేశాడు ?

కర్నూలు అర్బన్ జిల్లా తాలుకా సీఐగా కంబగిరి రాముడు విధులు నిర్వహిస్తున్నారు. పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద ఈనెల 19వ తేదీన పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో రూ. 75 లక్షల నగదు లభ్యమైంది. అనంతరం తాలుకా పీఎస్ కు తరలించారు. అంత డబ్బు చూసే సరికి ఆ సీఐ కళ్లు బైర్లు కమ్మాయేమో.. ఆ నగదును ఎలాగైనా కాజేద్దామని ప్లాన్ చేశాడు. కానీ.. ఆ డబ్బుకు సంబంధించిన బాలకృష్ణ అనే వ్యక్తి తగిన ఆధారాలు చూపాడు. తన నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని కోరాడు. కొన్ని నిబంధనలు ఉంటాయని.. రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుందని ఏవోవో చెప్పుకొచ్చాడు. చివరకు అసలు విషయం చెప్పాడు.

రూ. 15 లక్షలు దోచేశాడు..

స్వాధీనం చేసుకున్న డబ్బు (రూ. 75 లక్షల్లో)లో కొంత ఎస్పీకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. పట్టుబడిన రూ. 75 లక్షల్లో రూ. 60 లక్షలు బాలకృష్ణకు ఇచ్చాడు. మిగతా రూ. 15 లక్షలు దోచేశాడు. కామ్ గా ఊరుకోని బాలకృష్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలుసుకున్న సీఐ రాముడు పరారయ్యాడు. సీఐ సిఐ కంబగిరి రాముడుతో పాటు మరో ముగ్గురి పై 384,389, R/W 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముగ్గురిపై కేసు నమోదు..

ఓర్వకల్లుకు చెందిన గౌరీశంకర్ ద్వారా మామూళ్ల వ్యవహారం సీఐ నడిపినట్లు తేలింది. హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి, కర్నూలుకు చెందిన భాస్కర్ రెడ్డి ఇందుకు సహకారం అందించారని నిర్ధారించారు. వీరి ముగ్గురిపై కేసు నమోదైంది. వీరందరూ పరారీలో ఉన్నారు. కంబగిరి రాముడి కోసం ప్రత్యేక టీంల ద్వారా పోలీసులు గాలిస్తున్నారు. సీసీఎస్ సీఐగా ఉన్న శేషయ్యకు కర్నూలు అర్బన్ తాలుకా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. చివరకు సీఐ కంబగిరి రాముడు సస్పెన్షన్ చేస్తూ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us