అపహరణకు గురైన శిశువు లభ్యం

UPDATED 26th NOVEMBER 2017 SUNDAY 9:00 PM

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ లో గురువారం అపహరణకు గురైన ఆడ శిశువు కథ సుఖాంతమైంది. పోలీసుల సహకారంతో ఎట్టకేలకు శిశువు తల్లి ఒడికి చేరింది. జిల్లా పోలీస్‌ శాఖ అహర్నిశలూ శ్రమించి సుమారు 65 గంటల వ్యవధిలోనే మిస్టరీని ఛేదించింది. ప్రత్యేక కాన్వాయి మధ్య అంబులెన్సులో జీజీహెచ్‌కు చేరుకున్న శిశువును జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో మధ్యాహ్నం తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను అపహరించిన నిందితురాలు నగరంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి పొత్తిళ్లలో ఉన్న శిశువు అపహరణ జిల్లా పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. వైద్య, సాంకేతిక, పోలీస్‌ శాఖలు పరస్పర సమన్వయంతో శిశువు జాడకోసం వెతికాయి. కాకినాడ నుంచి మహిళ చిత్రాన్ని బెంగళూరు, చెన్నెలతో పాటు ఇతర రాష్ట్రాలకు పంపి సాంకేతిక నిపుణుల సహకారంతో మహిళ స్పష్టమైన చిత్రాన్ని రూపొందించగలిగారు. ఆమె చిత్రమే విచారణలో కీలక పాత్ర పోషించింది. ఆదివారం నిర్వహించిన కార్బన్‌ సెర్చిలో భాగంగా కాకినాడ వన్ టౌన్ సీఐ ఏఎస్‌ రావుకు ఓ కీలక సమాచారం అందింది. కచేరిపేటలోని వెంకటేశ్వర కాలనీలో ఓ మహిళ గురువారం ఇంటి వద్దే ప్రసవం అయ్యానంటూ శుక్రవారం పుట్టింటికి వెళ్లిపోయిందని దాని సారాంశం. ఆ కొద్దిపాటి సమాచారమే యావత్‌ విచారణ ఘట్టాన్ని కీలకమైన మలుపు తిప్పింది. విషయాన్ని లోతుగా పరిశీలించిన సీఐ తన బృందంతో మహిళ ఇంటికి చేరుకున్నారు. ఇల్లు తాళం వేసి ఉండగా పగులగొట్టి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహిళ ఆధార్‌ కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో సీసీ టీవీ ఫుటేజిలో మహిళ ధరించిన దుస్తులు కంట పడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని మహిళ ఆచూకీపై స్థానికులను ఆరా తీశారు. స్థానికంగా ఓ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ భర్తను ఫోను చేసి తన భార్య ప్రసవం వివరాలు తెలపాలంటూ సీఐ అతడ్ని కోరారు. అతగాడి వైఖరి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భార్య ఆచూకీ తెలపాలంటూ కోరగా ఆమె పుట్టింటి చిరునామా ఇచ్చాడు. పోలీస్‌ బృందాలు ఆ చిరునామా ఆధారంగా మహిళ పుట్టిల్లు ఉన్న ఐ.పోలవరం మండలం జి.మూలపొలం సమీపంలోని యర్రగరువు గ్రామానికి చేరుకున్నాయి. వారితో పాటు శిశువు అమ్మమ్మను పోలీస్‌ బృందాలు తీసుకెళ్లాయి. శిశువును గుర్తించిన ఆమె ఆ శిశువు తన మనుమరాలేనంటూ పోలీసులకు తెలిపింది. శిశువు వివరాలపై అక్కడే ఉన్న నిందితురాలు పండు రవణను పోలీసులు ఆరా తీయగా తన బిడ్డేనంటూ వాదించింది. కాకినాడలోని తాను అద్దెకుంటున్న ఇంట్లో గురువారం రాత్రి ప్రసవించి తన పుట్టింటికి వచ్చానని నమ్మబలికింది. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయాన్ని వెల్లడించింది. తనకు రెండుసార్లు గర్భస్రావం అయిందని, పిల్లలు కావాలని భావించి పెంచుకునే ఉద్దేశంతో శిశువును అపహరించానని ఒప్పుకుంది. పండు రవణ తాను గర్భవతినని స్థానికులతో పాటు దూరంగా ఉంటున్న కుటుంబసభ్యులనూ నమ్మించింది. ఏడో నెల వచ్చిందంటూ రెండు నెలల క్రితం కుటుంబసభ్యుల మధ్య అత్యంత వైభవంగా శ్రీమంతమూ చేసేసుకుంది. తాను గర్భవతినయ్యానంటూ కాకినాడలో నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రి యాజమాన్యానికి చెబుతూ సెలవు పెట్టుకుంది. ఈ వ్యవహారమంతా నిందితురాలు ముందస్తు ప్రణాళికతోనే అపహరణకు పాల్పడిందన్న విషయం అర్థమవుతోంది.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us