UPDATED 5th SEPTEMBER 2022 MONDAY 03:00 PM
Chandrababu Naidu on chennupati: ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న టీడీపీ ఏపీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీని ఇవాళ చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము దోషులు ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఏపీలో వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి రౌడీమూకల ఆగడాలకు అంతులేకుండా పోయిందని అన్నారు.
ఇటీవల గాయపడ్డ చెన్నుపాటి గాంధీ కన్ను పూర్తిగా దెబ్బతిందని ఆయన చెప్పారు. ఆయనపై దాడి జరిగితే అది భావోద్వేగంతో జరిపిన దాడి అని పోలీసులు అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులకు పాల్పడ్డ వారికి అండగా ఉండడమే పోలీసుల బాధ్యతనా అని నిలదీశారు. అంతేగాక, బాధితుడైన చెన్నుపాటి గాంధీపైనే కేసులు పెట్టాలనుకున్నారని ఆయన చెప్పారు. ఇటువంటి దాడులకు తాము భయపడబోమని అన్నారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎన్నటికీ బాగుపడబోరని చెప్పారు. ఇటువంటి రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని అన్నారు.
కాగా, జయవాడ 9వ డివిజన్‌లో చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు అంటోన్న విషయం తెలిసిందే. అయితే, వైసీపీ నేతలను స్థానికులు అడ్డుకుకోవడంతో చెన్నుపాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారని చెబుతున్నారు. చెన్నుపాటిపై ఇనుపచువ్వతో దాడి చేయడంతో ఆయన కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది.







