UPDATED 11th NOVEMBER 2022 FRIDAY 6:25 PM
Tirumala Laddu Prasadam Weight : తిరుమల లడ్డూ కౌంటర్ల దగ్గర తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లడ్డూ బరువు తగ్గిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై స్పందించిన అధికారులు ఈ తనిఖీలు చేశారు.
ఉండాల్సిన బరువులోనే అన్ని లడ్డూలు ఉన్నట్లు తేల్చారు. వేయింగ్ మిషన్ లో సాంకేతిక సమస్యల వల్లే లడ్డూ బరువు తక్కువ చూపించిందన్న అధికారులు.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణంపై, బరువుపై అపోహలు వద్దన్న అధికారులు కచ్చితంగా 160 నుంచి 180 గ్రాములే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అత్యంత ప్రీతిపాత్రంగా చూస్తారు. కాగా, లడ్డూ ప్రసాదం బరువు తగ్గిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆలయ నిబంధనల ప్రకారం శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కానీ, ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలు తూకం వేయగా.. 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. దీంతో భక్తుడు లడ్డూ కౌంటర్‌లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లడ్డూలు చిన్నవిగా ఉండడాన్ని సదరు భక్తుడు నిలదీశాడు. దాంతో కౌంటర్ లో ఉన్న ఉద్యోగి ఓ లడ్డూను వెయింగ్ మెషీన్ పై ఉంచగా, అది 90 గ్రాములు తూగినట్టు కనిపించింది. దాంతో ఆ భక్తుడు ఇది చీటింగ్ అని మండిపడ్డాడు. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి కలిసి చేస్తున్న చీటింగ్ అని ఆరోపించాడు.







