Updated 2 February 2022 Wednesday 02:10 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 30 తేదీ కల్లా ప్రక్రియ పూర్తి కావాలని.. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. మిగిలిన 25 శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలు కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రొబేషన్ పై నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీస్ పెంచాం. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటనలు చేశాం. జూన్ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వినియోగించుకోవాలి. జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ లో రిబేటు పై స్థలాలు కేటాయించాం. 10 శాతం స్థలాలను 20శాతం రిబేటుపై కేటాయించాం. స్థలాల కేటాయింపునకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను మార్చి 5లోగా స్థలాలు కోరిన ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలి. దానికొచ్చిన డిమాండ్ బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలు పెన్షనర్లకు రిజర్వ్ చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలి" అని సీఎం జగన్ అన్నారు.







