UPDATED 5th JULY 2026 9:00 PM
* ముగ్గురిపై కేసు నమోదు.. రెండు ఆటోలు, వేయింగ్ మిషన్ సీజ్
* దివిలి ఎంఎల్ఎస్ పాయింట్‌కు అక్రమ బియ్యం తరలింపు
* స్థానిక ఎంఎస్వో పాత్రపై అనుమానాలు!
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూలై 5: పేద ప్రజల పొట్టగొట్టి, ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను పెద్దాపురం సివిల్ సప్లైస్ అధికారులు గుట్టురట్టు చేశారు. గోరింట గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు తొమ్మిది టన్నుల (90 క్వింటాళ్లు) రేషన్ బియ్యాన్ని అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
తక్కువకు కొని.. ఎక్కువకు అమ్ముతూ..
అధికారుల కథనం ప్రకారం... గోరింట దాని చుట్టుపక్కల గ్రామాల్లోని పేద ప్రజల నుంచి రాసంశెట్టి లచ్చబాబు అనే వ్యక్తి తక్కువ ధరకే రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నాడు. అలా సేకరించిన బియ్యాన్ని ఎక్కువ ధరకు బయట మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ అక్రమ వ్యాపారంలో అతనికి కోశెట్టి దుర్గా గణేష్, పచ్చిపాల వెంకట సతీష్ అనే ఆటో డ్రైవర్లు అనుచరులుగా మారి సహాయం అందిస్తున్నారు. ఆటోల ద్వారా రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూ నిల్వ ఉంచుతున్నారు.
మెరుపు దాడి.. భారీగా పట్టుబడ్డ నిల్వలు
నమ్మదగిన సమాచారంతో పెద్దాపురం డిప్యూటీ తహశీల్దార్ నేతృత్వంలోని సివిల్ సప్లైస్ సిబ్బంది గోరింట గ్రామంలోని ఒక ఇల్లే కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 9 టన్నుల పిడిఎస్ బియ్యం బయటపడింది. దాడి జరిగిన స్థలంలో బియ్యంతో పాటు, అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న రెండు ఆటోలను, బియ్యాన్ని తూకం వేసే ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌ను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నిబంధనల ప్రకారం దివిలి ఎంఎల్ఎస్ పాయింట్‌లో అప్పగించారు.
ఎంఎస్వో పాత్రపై అనుమానాల జడి!
గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలు జరుగుతున్నా స్థానిక MSO గుర్తించకపోవడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ నెట్‌వర్క్ నడుస్తున్నా స్థానిక అధికారికి సమాచారం లేకపోవడం వెనుక లోపాయకారీ సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో స్థానికంగా బలీయమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి పోలీస్ యంత్రాంగం
ఈ భారీ రేషన్ అక్రమ రవాణా ఉదంతంపై పెద్దాపురం పోలీసులు సీరియస్ అయ్యారు. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు మేరకు పెద్దాపురం సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్సై పాపారావు కేసు నమోదు చేశారు. నిందితులు లచ్చబాబు, దుర్గా గణేష్, వెంకట సతీష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు, ఈ నెట్‌వర్క్‌తో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.







