UPDATED 18th MAY 2018 FRIDAY 7:00 PM
కాకినాడ: 2018-19 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, కార్పొరేట్, రికగ్నైజ్డ్ పాఠశాలల్లో విద్యార్ధులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ ఎ.పి. స్టేట్ కమీషన్ మెంబర్ పి.వి.వి. ప్రసాదరావు అన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలతో పాటు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో మహిళలపై అత్యాచారాలు నిరోధానికి ప్రతి గ్రామంలో ఫ్రెండ్లీ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు ఈ కమిటీలు గ్రామాలలో ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, ఎస్.సి.పి.సి.ఆర్ కమీషన్ సమన్వయంతో గట్టిగా ప్రయత్నం చేస్తుందని ఇందుకు ప్రజలందరూ సహకరించాలని, దీనిపై మీడియా ప్రచారం చేసి ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు. బాలికలపై చిన్నచూపు ఉండకూడదని, బాలబాలికలు ఇద్దరూ సమానమేనని భావించాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి ప్రత్యేకమైన అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటుచేసి బాలల హక్కుల గురించి అవగాహన కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. బాల్య వివాహాలు నిర్మూలించడంలో విఆర్వో, పంచాయతీ సెక్రటరీలు ఇతర గ్రామస్థాయి అధికారుల సహకారం తీసుకుని తగు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా బాలల హక్కులు ఉల్లంఘించడం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహిళలపై జరిగిన అత్యాచార కేసులు 2016-17లో ఐదు, 2017-18 పదమూడు మొత్తం 18 కేసులకు 6 లక్షల 25 వేలు పరిహారం అందించడం జరిగిందన్నారు. ఎయిడ్స్ వ్యాధి బాధితులకు 357 మందికి 500 రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలకు 40 లక్షల 54 వేలు పంపిణీ చేశామన్నారు. బాల్య వివాహాలు 125 నిలుపుదల చేయడం జరిగిందని, బాలికాకిశోర కార్యక్రమంపై అవగాహన కల్పించామని, 650 బాలికా కిశోర గ్రూపులు ఏర్పాటుచేసి వీధిబాలలు అనాధలను గుర్తించి 17,144 మందిని హాస్టల్లో చేర్పించడం జరిగిందన్నారు. స్వచ్చంధ సంస్థలు 53, గవర్నమెంట్ ఆరు ఏర్పాటు చేయడం జరిగిందని, వారి ద్వారా వీధిబాలలను హాస్టల్లో చేర్పించి విద్య నేర్పించడం జరుగుతుందని, చదువుకున్న వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి ఎన్. సీతామహాలక్ష్మి, ఎస్ఎస్ఏ పివో ఎం. శేషగిరి, ఏపిడి పి. మణమ్మ, డిసిపిఓ సి.హెచ్. వెంకటరావు, సిడిపివో పి.సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.







