రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: దేశంలో కొవిడ్ ఉద్ధృతి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. ఎవరికైనా జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, రుచి లేదా వాసన కోల్పోవడం, అలసట, విరేచనాలు కనిపించినట్లయితే కొవిడ్ అనుమానిత కేసుగా పరిగణించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాంటి వారికి వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపాలని సూచించింది. ఫలితాలు వచ్చేవరకూ.. లక్షణాలున్నవారు తక్షణమే హోం ఐసోలేషన్‌లో ఉంచాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 1200 దాటాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర, దిల్లీలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ టెస్టులు భారీగా పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ‘దేశవ్యాప్తంగా నిత్యం 20లక్షల కొవిడ్ టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. ఒకవేళ ఆర్‌టీ-పీసీఆర్ ఫలితం ఆలస్యం అవుతుందనుకుంటే వెంటనే ర్యాపిడ్ టెస్టులు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వీటికి అదనంగా స్వతహాగా ఇంట్లోనే చేసుకునే ర్యాపిడ్ టెస్టులను కూడా ప్రోత్సహించాలి. ఇప్పటికే అటువంటి ఏడు టెస్టు కిట్‌లకు అనుమతి ఉంది’ అని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. అనుమానితులను వెంటనే గుర్తించి కొవిడ్ పరీక్షలు చేయడంతోపాటు వైరస్ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నాడు 16 వేలకుపైగా పాజిటివ్ కేసులు వెగులు చూశాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో కొవిడ్ ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతున్నట్లు వెల్లడైంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, గుర్‌గావ్, కోల్‌కతా నగరాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. దీంతో మూడోవేవ్ ప్రారంభమైనట్లేనని ఇప్పటికే పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. అయితే, వైరస్ కట్టడికి సన్నద్ధంగా ఉండాలన్న కేంద్రం.. భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది.







