అమరావతి (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని.. రెండున్నరేళ్లు పూర్తయినా ఎందుకు దాన్ని అమలు చేయడం లేదని సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్పలరాజు ప్రశ్నించారు. సీపీఎస్‌పై మూడు కమిటీలు ఎందుకు వేశారని నిలదీశారు. ‘సింహగర్జన’ పేరిట విజయవాడ శాతవాహన కళాశాలలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సభ నిర్వహించారు. ఈ సభలో అప్పలరాజు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు తమ హక్కు అన్నారు. దాన్ని రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని చెప్పారు. వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరయ్యారు.







