UPDATED 19th FEBRUARY 2018 MONDAY 8:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో యువ ఇంజినీర్లకు యూనివర్సిటీ అఫ్ టెక్సాస్, అర్లింగ్టన్(యు.టి.ఎ)లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ప్రవేశాలు పొందే అంశంపై సోమవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అఫ్ టెక్సాస్, అర్లింగ్టన్(యు.టి.ఎ) కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అసోసియేట్ డీన్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఆనంద్.జె. పుష్పాల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిఆర్ఈ, టోఫెల్, ఐ.ఇ.ఎల్.టి.ఎస్ స్కోర్ ఆధారంగా మాస్టర్స్ డిగ్రీలో ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులు, వాటితో పాటు జిఆర్ఈ, టోఫెల్, ఐ.ఇ.ఎల్.టి.ఎస్ మార్కుల జాబితా ఆన్ లైన్ లో సమర్పించాలని అన్నారు. ఈ యూనివర్సిటీ భారతీయ విద్యార్థులకు సొంత ఇంటి వాతావరణాన్ని తలపిస్తుందన్నారు. యు.టి.ఎలో మాస్టర్ డిగ్రీ అభ్యసించేందుకు గల కోర్సులు గురించి విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తెలియచేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఆర్ధికసహాయం అందచేస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ ఆనంద్.జె. పుష్పాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ పి.వి.జి.కె. జగన్నాధరాజు, డాక్టర్ ఎస్. మూర్తి, అకడమిక్ డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, సివిల్, మెకానికల్ విభాగాధిపతులు డాక్టర్ డి.వెంకటేశ్వర్లు, కె. సుబ్బారావు, యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ (యు.టి.ఎ) పరిశోధనా విద్యార్థి శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.







