సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ సమ్మేళన్‌ విజయవంతం

UPDATED 13th JUNE 2017 TUESDAY 7:00 PM

కాకినాడ : కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో అవినీతికి తావులేని సుపరిపాలన అందించి, పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేసిందని, కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు దీవెనలివ్వాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కోరారు. మంగళవారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నరేందర్ మోడీ ప్రభుత్వ మూడేళ్ల సుపరిపాలనపై "సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌" పేరుతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాకినాడ ఎంపీ తోట నరసింహం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి వై.సుజనా చౌదరి మాట్లాడుతూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. పేదల కోసం నరేందర్ మోడీ ప్రవేశపెట్టిన పథకాలు దిగ్విజయంగా సాగుతున్నాయని, ఈ మూడేళ్లలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అధికంగా సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని, దేశాభివృద్ధికి ప్రధాని మోడీ సంకల్పించి, స్వచ్ఛభారత్‌, పట్టణాల అభివృద్ధి ద్వారా మరింత ప్రగతి సాధించటానికి కృషి చేస్తున్నారన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంలో రాష్ట్రంలో 7వేల కి.మీ మేర సీసీ రోడ్లు వేయటానికి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ జిల్లాలో రైల్వేలైన్ల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం రూ.630 కోట్లు, కాకినాడ-పిఠాపురం మొయిన్‌ లైన్‌కు రూ.200కోట్లు, కోటిపల్లి-నరసాపురం లైన్‌కు రూ.630కోట్లు మంజూరు చేసిందన్నారు. 900 కి.మీ మేర కోస్టల్‌ కారిడార్‌, రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి కేంద్రం సహకరిస్తోందని, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి లను స్మార్ట్‌ సిటీలుగా రూపొందించటానికి అనేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పేదరికంపై గెలుపునకు కృషి చేస్తోందని, ఆయన ప్రధానిగా ఉన్న పార్లమెంటులో ఎంపీగా ఉండటం నా అదృష్టం అన్నారు. మోడీ ప్రభుత్వం మూడేళ్లలో అవినీతిలేని పాలన అందించిందని, గత 69 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఏ కేంద్ర ప్రభుత్వం చేయని సాయం మోడీ ప్రభుత్వం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. అనంతరం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, ప్రధాని కౌసల్య వికాస యోజన వంటి పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కేంద్ర మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, రాము సూర్యారావు, లక్ష్మీశివకుమారి, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రు, ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, అయితాబత్తుల ఆనందరావు, తోట త్రిమూర్తులు, దాట్ల బుచ్చిబాబు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కేవీ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ మల్లికార్జున, విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ యాళ్ల దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, బిజెపి జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణరాజు, నాయకులు పైడా కృష్ణమోహన్‌, బిక్కిన విశ్వేశ్వరరావు, ఉంగరాల చినబాబు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us