బ్యాంకర్ల తీరు పై కలెక్టర్ ఆగ్రహం

UPDATED 9TH MAY 2017 TUESDAY 7:00 PM

కాకినాడ : ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రుణాలపై బ్యాంకర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించడంపట్ల  జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ కోర్టు హాల్ లో  మంగళవారం ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకర్లతో ఉపాధి రుణాల మంజూరు లక్ష్యాల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెల 27న సమన్వయ సమావేశం నిర్వహించారని, ఈనెల 10వ తేదీ నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలని నిర్ధేశించినా , నిర్లక్ష్యం వహించడంపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలు పట్టించుకోరా.. పేదరికాన్ని రూపుమాపటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు అర్థంకావడం లేదా అని కలెక్టర్‌ సూటిగా ప్రశ్నించారు. రుణాల మంజూరు విషయంలో ఇదే ధోరణి ప్రదర్శిస్తే లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురై బ్యాంకుల వద్ద నిరసనలు, ధర్నాలు, సత్యాగ్రహాలు చేపట్టి కార్యకలాపాలు స్తంభింపచేసే పరిస్థితి ఎదురుకావడం త‌థ్య‌మన్నారు. ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఎస్సీ లబ్ధిదారులకు 4,889 యూనిట్లకు గాను 615, బీసీ లబ్ధిదారులకు 13,844 యూనిట్లకు గాను 1,297 మాత్రమే మంజూరుకు బ్యాంకు ఖాతాలు తెరిచారని చెప్పారు. ఇది చాలా దారుణమన్నారు. ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా లీడ్‌ బ్యాంకు ఆంధ్రాబ్యాంకు, మరో ప్రధానమైన ఎస్‌బీఐ కూడా రుణాలు మంజూరులో నిరాశ కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఆదర్శంగా నిలవాల్సిన మీరే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఈనెల 15వ తేదీనాటికి పరిస్థితుల్లో మార్పు రావాలని, వైఖరి మారకపోతే మా వైఖరి మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రుణాల మంజూరుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, మండలస్థాయిలో జరిగే సమన్వయ సమావేశాలకు బ్యాంకు మేనేజర్లు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో ఎల్ డి ఎం  సుబ్రమణ్యం, ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు అనురాధ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us