Updated 6th April 2023 Thursday 8:10 pm
Konaseema Thirumala : కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు గురువారం చక్రతీర్థస్నానం గౌతమి గోదావరి తీరాన భక్తుల గోవిందనామస్మరణ మధ్య కనులపండువగా జరిగింది. స్వామివారి చక్రస్నాన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ముందుగా మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సరసన చక్రత్తాళ్వారులకు పంచామృతాభిషేకం, నీరాజనం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు.
అనంతరం సాయంత్రం చోర సంవాదం కార్యక్రమాన్ని రమణీయంగా నిర్వహించారు. ధ్వజఅవరోహణ కార్యక్రమంలో ధ్వజస్తంభం వద్ద గరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పొంగలి నివేదన చేసి గరుడ పటాన్ని కిందకు దించి తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకమండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు కల్యాణమూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.







