హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: తన తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇంటిని నటి మంచులక్ష్మి నెటిజన్లకు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఇంటిపై ఆమె హోంటూర్ వీడియో చేశారు. దానికి సంబంధించిన ప్రోమోని తాజాగా ఆమె యూట్యూబ్ వేదికగా షేర్ చేశారు. ఇంద్రభవనాన్ని తలపించేలా ఉన్న ఈ ఇంటిని పరిచయం చేస్తూ.. ‘‘ఇది మా నాన్న కట్టించుకున్న ఆరో ఇల్లు’’ అంటూ ఏరియల్ వ్యూ చూపించారు. ప్రవేశ ద్వారంతోపాటు ఇంటిబయట గోడలపై మోహన్‌బాబు తన అభిరుచికి తగ్గట్టు అద్భుతమైన కళాకృతులను చెక్కించుకున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ‘మహానటి’ సినిమాలో ‘ఘటోత్కచుడి’గా తాను చేసిన పాత్రకు సంబంధించిన ఫొటోని పెద్ద ఫ్రేమ్ చేయించి మెట్ల మార్గంపై పెట్టించారు. లివింగ్, ఆఫీస్ రూమ్స్ గోడలపై తనకి వచ్చిన అవార్డులు, తన సినిమాలకు సంబంధించిన మధురజ్ఞాపకాలతో నింపేశారు. ఇలా ఎంతో సరదాగా సాగుతోన్న ఈ వీడియో చివర్లో.. ‘‘ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తున్నావా’’ అని మోహన్‌బాబు ప్రశ్నిస్తూ కనిపించగా.. ‘‘ఇప్పటికే చూపించేశాం కదా నాన్నా’’ అని లక్ష్మి సమాధానం చెప్పడంతో ఆయన ఆమెను సరదాగా పక్కకు తోసివేశారు. అనంతరం తన మనవరాలు, లక్ష్మి కుమార్తెతో సరదాగా ఫైట్ చేశారు.







