UPDATED 17th OCTOBER 2022 MONDAY 06:00 AM
▪️ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దంపతులు
▪️ కోదండరామ అలంకరణలో శ్రీవారు హనుమద్వాహనంపై విహరింపు
Konaseema Thirumala Vadapalli : వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ బహుళ సప్తమి ఆదివారం మూడోరోజు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్య హవచనం, పంచామృత మండపారాధన, మహాస్నపనము, ప్రధాన హోమాలు తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాలను తిలకించారు.
లోకకల్యాణార్థం శ్రీనివాసుని కల్యాణం..
లోక కల్యాణార్థం శ్రీ శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం బ్రహ్మశ్రీ ఖండవల్లి రాజేశ్వరవర ప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు స్వామివారి కల్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. మంగళసూత్రధారణ, తలంబ్రాలు తంతును శాస్ర్తోక్తంగా జరిపించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, లావణ్య దంపతులు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించి స్వామివారికి పట్లువస్ర్తాలను సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అశేష భక్తజనం, ప్రముఖులు స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించి మంత్ర ముగ్ధులయ్యారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కోదండరామ అలంకరణలో శ్రీవారు..
స్వామివారు రాత్రి కోదండరామ అలంకరణ, పుష్పాలంక రణలో స్వర్ణశోభితుడై హనుమద్వాహనంపై ఆశీనులయ్యారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురమాఢ వీధులలో కోదండరామ అలంకరణతో శ్రీవారు హనుమద్వాహనంపై విహరించారు. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంప తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పి.సురేష్‌రాజు, మన్యం సూర్య కుమారి భాను, రెడ్డి రవీదేవి, మెర్ల వెంకటేశ్వర్లు, ఏపుగంటి కనకారావు పాల్గొన్నారు. రాత్రి కోలాట ప్రదర్శనతోపాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.







