UPDATED 1st AUGUST 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: తల్లి పాలు బిడ్డకు ఆకలి తీర్చడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి సేపేని సురేష్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా స్థానిక సత్యనారాయణపురంలో గల అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు పాలివ్వడం ప్రతీ ప్రాణికి ఉండే సహజ లక్షణమని, బిడ్డ పుట్టిన గంటలోపు తాగించే తల్లి పాలు ఆ బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపించి వ్యాధి నిరోధక టీకాగా ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారని అన్నారు. తక్కువ బరువు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న శిశువులకు తల్లి పాలతో వాటిని అధిగమించే శక్తి వస్తుందని, ఇంతటి ప్రాధాన్యం ఉన్న తల్లి పాల ఆవశ్యకతను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఉమాదేవి మాట్లాడుతూ తల్లి పాలలో శిశువుకు అవసరమైన అన్ని రకాల పోషక పదార్థాలు లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. తల్లిపాల వారోత్సవాలను ప్రతీ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించడంతో పాటు తల్లిపాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, ఆశావర్కర్ స్వర్ణలత, హెచ్ఆర్పీలు కాసులు, ఆశాజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.







