UPDATED 5th DECEMBER 2022 MONDAY 3:35 PM
Davuloori Dorababu: బీసీల జీవితాల్లో జగనన్న వెలుగు.. విజయవాడలో జరగబోతున్న "జయహో బీసీ" మహాసభతో వైఎస్సార్సీపీ నాయకత్వంలో సాధించిన సాధికారతకు మరింత భరోసా కలగనుంది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా మెజారిటీగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అయితే ఈ అన్యాయానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడారు. 2019 ఎన్నికలకు ముందు ఏలూరులో వైస్సార్సీపీ బీసీ గర్జన నిర్వహించినప్పుడు అధికారంలోకి వస్తే బీసీలకు ఏం మేలు చేస్తాననే అంశాలతో వై.ఎస్.జగన్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఆ రోజు చెప్పిన మాటలను, చేసిన
వాగ్దానాలను ఆచరించి చూపారు. ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా ఈ వర్గాలకు ప్రయోజనం అందించి బీసీలు ప్రగతి పథంలో సాగేలా చేశారు.
సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో ఎటువంటి దళారులు లేకుండా నేరుగా రూ. 1.77 లక్షల నగదు జమ చేస్తే ఇందులో బీసీలకు లభించింది రూ. 85.915 కోట్లు భారతదేశ చరిత్రలోనే బీసీలకు ఇంత మొత్తం కేటాయించి వారి బతుకుల్లో వెలుగు నింపిన ఘనత ముఖ్యమంత్రి జగన్ అన్నదే. 25 మంది సభ్యులు ఉన్న మంత్రివర్గంలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 13 జిల్లా పరిషత్ లను గెలుచుకుంటే ఇందులో 9 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను అంటే 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు 635 మండల అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుంటే ఇందులో 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు.
ఈ రకంగా పరిపాలనలో సింహభాగం బీసీలకు భాగస్వామ్యం ఇచ్చిన ప్రజానాయకుడు దేశంలోనే లేరు. ఇదంతా గ్రామాల్లో మారుమూల ఉన్న బీసీలకు కూడా తెలిసిన విషయాలే. అయితే బీసీల హక్కుల కోసం, వారు ఎవరి దయా దాక్షిణ్యాలపైనా ఆధారపడకుండా వైఎస్సార్సీపీ చేస్తున్న కృషి ఇంకా ఉంది.
సామాజిక న్యాయం చేకూర్చే బీసీ బిల్లులు...
2019 మే 30న ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం చేసి బిల్లును ఆమోదించారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ఓబీసీ ప్రైవేటు బిల్లుకు పది రాజకీయ పార్టీలు మద్దతిచ్చినా పార్లమెంటు యధాప్రకారం మూజువాణి ఓటుతో తిరస్కరించింది. పార్లమెంట్లో బీసీల ప్రాతినిధ్యం ఎన్నడూ కూడా ఇరవై శాతానికి మించలేదు.
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి బీసీలు కోరుతున్నారు. బీసీ కులాలు జనాభాలో 52 శాతం ఉన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, విద్య ఉపాధి రంగాలలో బీసీలకు అగ్రకులాల వారితో పోటీపడే సత్తా లేదు. అందుకే 8 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు వై.ఎస్. జగన్ కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్ల వల్ల విద్య ఉపాధి రంగాల్లో, చట్టసభల్లో ప్రవేశం పొందిన పద్ధతి లోనే బీసీలు కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారు. ఓబీసీ బిల్లు పార్లమెంట్లో ఇంకా ఆమోదం పొందలేదు. వైఎస్సార్సీపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు వీగిపోయింది. దానిని కూడా గెలిపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన కీలకమైన అయిదు బిల్లుల్లో నాలుగు బీసీలకు సంబందించినవే.
1. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు.
2. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు
3. నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు
4. నామినేటెడ్ పోస్టుల్లో,
నామినేషన్లపై ఇచ్చే పనుల్లో మహిళలకు 50 శాతం కోటా, చట్టసభల్లో, ఉద్యోగావకాశాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ బిల్లుల వల్ల బీసీలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.
పెరగని రిజర్వేషన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 144కి చేరింది. గ్రూపు 'ఏ' లోని 54 కులాలకు ఏడు శాతం, గ్రూపు 'బీ' లోని 28 కులాలకు 10 శాతం, గ్రూపు 'సీ' లో ఒక కులానికి ఒక శాతం, గ్రూపు 'డీ' లో 47కులాలకు ఏడు శాతం, గ్రూపు 'ఈ' లో 14 కులాలకు నాలుగు శాతం కలుపుకొని మొత్తం 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కోటా వాటా పెంచకుండానే రిజర్వేషన్ల జాబితాలో కొత్తకులాలు చేరుస్తున్నారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల మీద 50 శాతం పరిమితిని విధించింది. తమిళనాడులో 69 శాతం, కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని బీసీ కులాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చలేదు. కేంద్రం గుర్తించిన ఒబిసి జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీసీ కులాలు 107 మాత్రమే గుర్తింపు పొందాయి. మహారాష్ట్రలో 261, ఒడిషాలో 200, కర్ణాటకలో 195, తమిళనాడులో 180, బీహార్ లో 133, జార్ఖండ్ లో 127, అస్సాంలో 124 కులాలు ఓబీసీ జాబితాలో చేరితే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 107 కులాలే కేంద్ర జాబితాలో చోటు చేసుకోగలిగాయి.
జనాభా లెక్కల్లో కులగణన...
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే దేశ జనాభా గణనలో కులాల వారీ లెక్కలు తీయాలని బీసీలు కోరుతున్నారు. బీసీ కులాల లెక్కలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. జనాభా లెక్కలు లేనందున సుప్రీం కోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసింది.
కులాలవారీ జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ ఏఏ గ్రూపునకు ఎంత శాతం నిర్ణయించాలో తెలియక ఇబ్బంది ఎదుర్కొంటుంది. రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కలేల్కర్, మండల్ కమిషన్ మాత్రమే గాక 242 బీసీ కమిషన్లు కూడా జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయాలని సిఫారసు చేశాయి. ఇదంతా బీసీల అభ్యున్నతి కోసం జరగాల్సిన కృషి. 2014 లో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2014-19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. చంద్రబాబు బీసీల వెన్నెముక విరగ గొట్టడం వల్లనే బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పంలో ఆయనను తరిమికొట్టేందుకు ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. బీసీలు అందరికీ నిజమైన సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో వైఎస్సార్సీపీకి బీసీలు వెన్నెముకగా మారారు.
జగన్ అన్న చూపిన వెలుగుబాటలో పయనిస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రతినిధులు 84 వేలమందితో పాటు వేలాదిమంది ప్రజలు హాజరయ్యే 'జయహో బీసీ' సంరంభం వెనుకబడిన వర్గాల కర్తవ్యాన్ని నిర్దేశించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు.
దవులూరి దొరబాబు
చైర్మన్
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్
(డిసెంబర్ 7వ తేదీ విజయవాడలో జరగనున్న 'జయహో బీసీ' కార్యక్రమం సందర్భంగా)







