UPDATED 20th AUGUST 2022 SATURDAY 11:00 AM
Sun Halo : ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుడు మునుపెన్నడూ చూడని విధంగా శనివారం సరికొత్తగా దర్శనమిచ్చాడు. సూర్యుని చుట్టూ ఓ గుండ్రటి వలయం ఏర్పడి అందరిని ఆకర్షించింది.
సూర్యుడు చుట్టూ అందమైన రంగురంగుల వలయం ఏర్పడటాన్ని ప్రజలు రకరకాల పద్ధతుల ద్వారా ఆసక్తిగా, వింతగా తిలకించారు. ఇది చూసేందుకు ఇంద్ర ధనస్సు మాదిరిగా ఉన్నా, గుండ్రంగా ఉండటం, సరిగ్గా అది సూర్యుని చుట్టూ ఏర్పడటంతో కొంతమంది భయాందోళనకి గురి అయ్యారు. మరికొంత మంది మాత్రం ఆశ్చర్యానికి లోనయ్యారు. సాధారణంగా ఇంద్రధనస్సు అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సూర్యుని చుట్టూ ఏర్పడిన పూర్తి వలయం దాదాపు ఇంద్రధనస్సు వలె వివిధ రంగులను పోలి ఉంది.
వలయం ఏర్పడిన సమయంలో కొంతమేర వేడి కూడా తగ్గినట్లు ఉందని ప్రజలు చెప్తున్నారు. విద్యార్థులు, చిన్నారులు తమకు తెలిసిన వారిని, ఉపాధ్యాయులను అడిగి సూర్యుని చుట్టూ వలయం ఏర్పడేందుకు, రంగులు కనిపించటానికి కారణమేంటనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇది ఖగోళ అద్భుతమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
సూర్యుని చుట్టూ వలయం ఎందుకు ఏర్పడుతుంది..?
ఈ వలయాలను సన్ హాలో, 22 డిగ్రీ హాలోస్ అని పిలుస్తారు. వాతావరణంలో 20వేల అంతకంటే ఎక్కువ ఎత్తులో మంచు స్పటికాలతో కూడిన మేఘాలు ఉండటం కారణంగా ఇటువంటి వలయాలు ఏర్పడుతుంటాయి. సూర్యుని కాంతి షట్కోణ ఆకారంలో గల ఈ మంచు స్పటికాలపై పడి వక్రీభవనం చెందినపుడు రంగురంగులతో కూడిన వలయాలు ఏర్పడుతాయి.







