Updated 20th February 2023 Monday 8:10 pm
Chandrababu : కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తల దాడి కలకలం రేపింది. టీడీపీ ఆఫీసులో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, కారుకు నిప్పు పెట్టిన ఘటనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. పోలీసు శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న సీఎం జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం అని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం కాస్తున్నారు? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.(Chandrababu)
”రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు.







