UPDATED 21 JANUARY 2022 FRIDAY 01.30 PM
తిరుచానూరు (రెడ్ బీ న్యూస్): ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆలయంలో శుక్రవారం నవకుండాత్మక శ్రీయాగం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు జరుగనున్న శ్రీయాగాన్ని ఆలయ అర్చకులు.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతుల చేతులమీదుగా శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9. 30 గంటలకు సంకల్పంతో యాగం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాలలో సంకల్పం, హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహించారు. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు.తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత “నవకుండాత్మక శ్రీయాగాన్ని” నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుబ్బారెడ్డి దంపతులు 34 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా ఇచ్చారు. అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈ హారాన్ని అలంకరించారు. జనవరి 27వ తేదీ వరకు యాగం నిర్వహిస్తారు.







