మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

UPDATED 14th DECEMBER 2017 THURSDAY 6:30 PM

అమరావతి: రాష్ట్రంలోని మాజీ సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సాయుధదళాల పతాక దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో వీరమరణం పొందిన ముగ్గురు సైనికుల సతీమణులను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరక్షణ కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేమన్నారు. దేశ సరిహద్దుల్లో సాయుధదళాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా త్యాగం చేస్తున్నారని ఆయన చెప్పారు. భారత మాత సేవకు అంకితమైన సైనికులు నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైనికులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని, వీరమరణం పొందిన ముగ్గురు సైనికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సాయుధ దళాల పతాక నిధికి విరివిగా విరాళాలు ఇచ్చి సైనికులకు అండగా నిలవాలని ఆయన పిలుపు నిచ్చారు. గత ఏడాది సాయుధ దళాల పతాక నిధికి రికార్డు స్ధాయిలో విరాళాలు సేకరించిన ప్రకాశం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను, ఆయా జిల్లాల సైనిక సంక్షేమాధికారులను చినరాజప్ప అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ, సైనిక సంక్షేమ విభాగం సంచాలకులు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us