పరిశ్రమల స్థాపనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

UPDATED 21st JUNE 2017 WEDNESDAY 11:00 PM

కాకినాడ : రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు స్థాపించి, యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్‌టీయూలో పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో బుధవారం సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన ద్వారానే  రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, పారిశ్రామిక అభివృద్ధి సాధించాలంటే శాంతిభద్రతలు ముఖ్యమని, రాజీపడకుండా వాటిని కాపాడుతున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించడం ద్వారా ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కొరత లేదని, నీటి కోసం పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో 17 భారీ పరిశ్రమలు స్థాపించటానికి రూ.11,005 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చారని, వాటిలో రూ.397.49 కోట్లతో ఏడు పరిశ్రమలు స్థాపించి, 1,889 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు సింగల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ పారిశ్రామికరంగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పునాది వంటిదని, వీటిని జిల్లాలో బలోపేతం చేస్త్తున్నామని, అలాగే ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే ఎనిమిది నియోజక వర్గాల్లో భూములను గుర్తించడం జరిగిందని, వీటిలో మూడుచోట్ల భూమిని ఏపీఐఐసీకి అప్పగించామన్నారు. పరిశ్రమల స్థాపనకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని, జిల్లాలో 50 వేల మందికి ఉపాధి కల్పించటానికి కార్యాచరణ రూపొందించామన్నారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన 16 మందితో రూ.25 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఒప్పంద పత్రాలను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మల్లికార్జున, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఏవీ పటేల్‌, ఆంధ్రాబ్యాంకు డీజీఎం భాస్కరరావు, నాబార్డు ఏజీఎం ప్రసాద్‌, దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ అధ్యక్షుడు కొండా శివాజీకుమార్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు గోపీ కృష్ణ, పరిశ్రమల శాఖ డీడీలు సుందర్‌కుమార్‌, దొరబాబు, జడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు, కాకినాడ ఛాంబరు ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దంటు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us