UPDATED 5th JUNE 2017 MONDAY 7:00 PM
శ్రీహరికోట : టెక్నాలజీ రంగంలో భారత్ మరో అద్భుతాన్ని సృష్టించింది. ఆ అద్భుతం ఇస్రో ఖాతాలో పడింది. అతి భారీ వాహననౌకను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో చరిత్రలో నిలిచిపోయింది. జీఎస్ఎల్వీ మార్క్3 డీ1 రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఇస్రోపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇస్రో ప్రయోగం ఓ టెక్నలాజికల్ మార్వెల్ అంటూ స్వయంగా ఆ సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది మాస్టర్‌పీస్ అని కూడా కీర్తించారు. లాంచ్ వెహికల్ పనితీరుపై భారీ ప్రయోగాలు నిర్వహించిన ఇస్రో చిట్ట చివరకు అత్యంత బరువైన వాహననౌకను తయారుచేయగలిగింది. ఇది సాలిడ్, లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలో పెను సంచలనం తీసుకువచ్చింది. అతి భారీ వాహననౌకను తయారు చేయడమే కాదు, దీంతో రాకెట్ వేగాన్ని కూడా పెంచారు. గంటకు సుమారు 31 వేల కిలోమీర్ల వేగంతో ఈ కొత్త రాకెట్ దూసుకెళ్లడం విశేషం. ఈ ప్రయోగం కోసం ఇస్రో అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొన్నది. చాలా సంక్లిష్టమైన టెక్నాలజీతో రాకెట్‌ను డిజైన్ చేశారు. ఈ ప్రయోగంతో భారత్ స్పేస్ టెక్నాలజీలో ముందు వరుసలో ఉన్న ఎలైట్ దేశాలతో జతకట్టింది. చాలా నిబద్ధతతో ఇస్రో ఈ ప్రయోగం కోసం పనిచేసింది. ఎన్నో ఏళ్లు ఇదే ప్రాజెక్టు మీద తన వనరులను ఉపయోగించింది. ఇది నిజంగా దేశానికి ఓ బహుమానం అని ఓ శాస్త్రవేత్త అన్నారు. జూన్ 5, 2017 చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఆయన అన్నారు. రాకెట్లను ఆకాశంలోకి తీసుకెళ్లే టెక్నాలజీలో ఇది క్వాంటమ్ జంప్ అని ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే ప్రతి ప్రయోగంపై దీని ముద్ర ఉంటుందని కూడా వాళ్లు అన్నారు. సాధారణంగా రాకెట్‌ను చూస్తే ఎత్తులో తేడా లేకున్నా, లిఫ్టా మాస్ మాత్రం పెరిగిందన్నారు. రాకెట్, శాటిలైట్ కెపాసిటీని కూడా పెంచారు. రాకెట్ మోసుకెళ్లే పేలోడు బరువును కూడా పెంచేశారు. ఈ ప్రయోగంతో ప్రపంచదేశాలు తమ వైపు చూస్తాయని ఇస్త్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో భారత్ ఫోకస్‌గా మారుతుందన్నారు. 2002లో ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఈ టెక్నాలజీ సాధ్యం అవుతుందో, కాదో అన్న సందేహం ఉండేదన్నారు. కానీ ప్రయోగానికి కావాల్సిన అన్ని పరికరాలు దేశంలోనే తయారు అయ్యాయన్నారు. స్వదేశీ కాంపోనెంట్స్, సూపర్ అలాయిడ్స్ అన్నీ మేడ్ ఇన్ ఇండియా అని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగంలోవాడిన ప్రతి మెషీన్‌ను భారత్‌లోనే డిజైన్ చేశారన్నారు. ప్రతి కంపోనెంట్‌ను మళ్లీ మళ్లీ టెస్ట్ చేశారన్నారు. ఇస్రో సక్సెస్‌లో శాస్త్రవేత్తల ఫ్యామిలీలు కూడా కీలక పాత్ర పోషించాయి. ప్రాజెక్టు స్మూత్‌గా సాగిందంటే అందులో ఫ్యామిలీ పాత్ర కూడా కీలకంగా మారిందన్నారు. మునుముందు భారీ వాహననౌకలను నింగిలోకి తీసుకువెళ్లేందుకు ఈ ప్రయోగం ఓ ముందడు అని శాస్త్రవేత్తలు చెప్పారు. డిజైన్‌లో ఎటువంటి లోపం లేకుండా చూసుకున్నామన్నారు. కంగ్రాట్స్ ఇస్రో.







