★ పనులు పరిశీలించిన దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి, విప్ జగ్గిరెడ్డి
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి రూ.52 కోట్ల ప్రసాద్ నిధులు మంజూరుకు కృషి చేస్తామని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి వాడపల్లి మేకటేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి సీఎం జగన్ రూ.2 కోట్లు విడుదల చేశారన్నారు. కోనేరు అభివృద్ధి ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కల్యాణ వేదిక నిర్మాణానికి రూ.54 లక్షలు విరాళం అందించిన గుత్తేదారులను అభినందించారు. ఆర్యవైశ్య కల్యాణ మండప నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆర్టేసీ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ విజయరాజు, సహాయ కమిషనర్ ప్రసాద్, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, డీఈ గోపాలకృష్ణంరాజు, రుద్రరాజు రమేష్ రాజు, కొత్త పేట ఎంపీపీ మార్గాన గంగాధరరావు జడ్పీటీసీ సభ్యుడు బోణం సాయిబాబు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కోరుప్రోలు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.







