UPDATED 9th MARCH 2018 FRIDAY 6:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏరువాక కేంద్రంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.వి. సత్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశంలో ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నందకిషోర్ గత ఖరీఫ్ పంట కాలంలో చేపట్టిన ప్రదర్శనా క్షేత్రాలు, చిరు సంచుల ప్రదర్శనా క్షేత్రాలు వాటి ఫలితాలు, ఇతర శిక్షణా కార్యక్రమాలు గురించి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు, రైతులకు వివరించారు. జిల్లాలో ప్రధాన పంట వరిలో ముఖ్యంగా వెదజల్లే వరిలో వచ్చే కలుపు, చీడపీడలు, నూతన పద్ధతులు గురించి రైతులకు డాక్టర్ సత్యనారాయణ వివరించారు. అలాగే అభ్యుదయ రైతులు పండించే పంటలలోని సమస్యలు, అవలంబించే నూతన పద్ధతులు గురించి అభ్యుదయ రైతులతో చర్చాగోష్ఠి నిర్వహించారు. అనంతరం 2018 -19 సంవత్సరంలో చేపట్టబోయే ప్రదర్శనా క్షేత్రాలు, రైతు శిక్షణా కార్యక్రమాలు గురించి కార్యాచరణ తయారు చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త సంచాలకుల తరఫున వి. జోగిరాజు, ఉద్యానవన శాఖ తరఫున వి. సిరిల్, రిలయన్స్ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ చిట్టిబాబు వారి పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలు గురించి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎన్. నాగేంద్రబాబు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.







