UPDATED 21st APRIL 2018 SATURDAY 6:00 PM
పెద్దాపురం: గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన రెండు కమ్యూనిటీ భవనాలను శనివారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా కమ్యూనిటీ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. గ్రామాల్లో సి.సి.రోడ్లు, డ్రైన్లు పూర్తిస్థాయిలో నిర్మించామని మంత్రి తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు సమన్వయంతో గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తే గ్రామాలు అభివృద్ది చెందుతాయని మంత్రి చెప్పారు. గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలని, దీనికి ప్రభుత్వం రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందచేస్తుందని చెప్పారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పేదల అమ్మాయి వివాహం నిమిత్తం చంద్రన్న వివాహ కానుక క్రింద ఉచితంగా ఆర్థిక సహాయం అందచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్.పి.టి.సి సుందరపల్లి శివ నాగరాజు, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, సామర్లకోట ఎఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.







