UPDATED 8th JUNE 2018 FRIDAY 7:00 PM
రంపచోడవరం: పేదరికం ఆర్ధిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ఐటిడిఎ కార్యాలయ సమావేశపు హాలులో నవ నిర్మాణ దీక్షలో భాగంగా మహాసంకల్పం -2018 కార్యక్రమాలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ప్రజలే ముందు, అవినీతి రహిత సమాజం, సులభంగా పౌరసేవలు, పారదర్శకత, జవాబుదారీ సుపరిపాలన, రియల్ టైమ్ గవర్నెన్స్ పరిష్కారవేదిక, ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు, స్వర్ణాంద్ర సాధన విజన్-2029 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సర్వతోముఖాభివృద్దికి, వికాస సాధనకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా అశాస్త్రీయంగా 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో విభజించారని, మరో ప్రక్క రాజధాని కూడా లేదని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మ స్థైర్యంతో అన్నిరకాలుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. పింఛన్లు ఐదు రెట్లు పెంచి 55లక్షల మందికి ఇచ్చిన ఘనత అయనకే దక్కుతుందన్నారు. రైతుల్ని ఆదుకోవడానికి రూ.24 వేలకోట్ల మేర రుణవిముక్తి చేస్తున్నారని, మహిళా సంఘాలకు పసుపు కుంకుమ క్రింద రూ.10 కోట్లు వెచ్చించారన్నారు. అన్ని కులాల్లో పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఏజెన్సీలో మహాసంకల్పంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, అన్ని కులాలవారు నవ నిర్మాణ దీక్షకు ప్రతిన పూనాలన్నారు. జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ తలసరి ఆదాయాన్ని పెంచడానికి, ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలును మిళితం చేస్తూ విశేషమైన కృషి చేస్తోందన్నారు. చెక్ డాములు నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, సేద్యపు నీటికుంటలు త్రవ్వకం ద్వారా భూగర్భజలాల స్థాయి పెంపుకు అనేక కార్యక్రమాలు నరేగా ద్వారా అమలు కాబడుతున్నాయన్నారు. సమర్ద నీటి నిర్వహణ చేపట్టి రాష్ట్రాన్ని కరువు రహితంగా మల్చడం జరుగుతోందని, వ్యవసాయ కుటుంబాల ఆదాయం పెంపుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, రైతాంగం రెట్టింపు ఆదాయం సాధించేలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఆచరించాలన్నారు. జీవ వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతము గ్యాస్ కనెక్షన్లు అందించడం ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూరుశాతం బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంతోపాటుగా ప్లాస్టిక్ వ్యర్థాలు లేని స్వచ్ఛమైన గ్రామాలుగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు ద్వారా రూపాంతరం చెందుతున్నాయన్నారు. పాఠశాలలు అన్నింటికి పైబర్ గ్రిడ్ ద్వారా వర్చువల్ తరగతులును నిర్వహణకు కృషి జరుగుతోందని, మారుమూల లోతట్టు గ్రామాలలో సౌరవిద్యుత్ వినియోగానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. సేవారంగంలో విస్తృతంగా ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలన్నారు. నిరుద్యోగులలో నిరాశా, నిస్పృహలను పారద్రోలడానికి భరోసాగా నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలలో గ్రామపంచాయితీ తీర్మానాల ద్వారా అందిన సమస్యలు, గ్రామస్తుల నుంచి వచ్చిన వ్యక్తిగత సమస్యలను క్రోడీకరించి వాటికి అవసరమైన నిధులు కొరకు ప్రభుత్వానికి నివేదించి ఆయా పనులు రానున్న కాలంలో చేపడతామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో యువ ఐఎఎస్ అధికారులు చక్కగా పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ అధికార యంత్రాంగం గిరిజనాభివృద్ధికి అన్నిరకాలుగా చేయూతను అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు ద్వారా భరోసాను కల్పిస్తున్నారన్నారు. అనంతరం శాసనమండలి ఉపాధ్యక్షుడు మహాసంకల్ప సందేశాన్ని సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్, చింతూరు పివో ఎం. అభిషిక్త్ కిశోర్, సబ్ కలెక్టరు వినోదకుమార్, డీఆర్డీఏ పిడి ఎస్. మల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఎంపిడివో బి. సరస్వతి, సర్పంచ్ నిరంజనీదేవి, అడబాల బాపిరాజు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







