UPDATED 9th OCTOBER 2017 MONDAY 3:00 PM
సామర్లకోట: సామాజిక కార్యక్రమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పెద్దాపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక టీటీడీసీలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సాధారణ సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, కేవలం సమాజాభివృద్ధికే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. ముఖ్యంగా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అనంతరం సంఘ గౌరవ అధ్యక్షుడు అడపా వెంకటరావు, కార్యదర్శి రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య) మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలను చేయడం ద్వారానే సమాజంలో పాత్రికేయులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. సంఘ సభ్యుల సహకారంతో త్వరలో పలు సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. సంఘ జిల్లా సహాయ కార్యదర్శి మాసా చంద్రరావు (చందు), ఈసీ మెంబర్ వీరభద్రవర్మ మాట్లాడుతూ సమాజంలో విలేఖరులపై రోజురోజుకు జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలన్నారు. అలాగే సంఘం తరపున పోరాటం చేసి బాధితులకు బాసటగా నిలవాలన్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, ఉపాధ్యక్షుడు కోశెట్టి రాంప్రసాద్, కోశాధికారి బద్ది కుమార్, సహాయ కార్యదర్శి చంద్రదాసు, కార్యనిర్వాహక కార్యదర్శి దేవరకొండ సుధాకర్, సభ్యులు ఇర్షాద్ ఆలీ, సుబ్రహ్మణ్యం ( సుబ్బు), శ్రీకాంత్, రాజా శ్రీనివాసు, ఎలిశెట్టి సత్యనారాయణ, వెంకట్, శ్రీను, లోవరాజు, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.







