Updated 30th March 2023 Thursday 6:10 am
Vadapalli Temple : స్వయంభువుడై ఎర్రచందనం అనే కొయ్య విగ్రహంతో మూర్తీభవించిన పరంధాముడు వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కోనసీమ తిరుమలగా (Konaseema Thirumala) విరాజిల్లుతున్న ఈ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరగనున్నాయి. తొలిరోజు అంకురార్పణ, ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1న రథోత్సవం, కల్యాణం, తీర్థం జరుగుతాయి. 2న శాంతి హోమం, విశేషార్చన, 3న స్వర్ణ వాహనంపై గ్రామోత్సవం, 4న మహదాశీర్వచనం, సదస్యం, 5న తెప్పోత్సవం, 6న చక్రస్నానం, 7న శ్రీపుష్పోత్సవంలను వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి రోజూ వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.
20 మంది కేరళ వాయిద్య కళాకారులతో చండీ మేళం, 8 మంది కళాకారులతో కేరళ వేలక్కు నృత్యం, 30 మందితో తమిళనాడు డ్రమ్స్, 10 మంది భరతనాట్య కళాకారిణులతో స్వామి, అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు. అంతేగాక రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలను చేపట్టామన్నారు. పలు డిపోలు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయని వారు పేర్కొన్నారు .







