వెంకటాచలం (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : కారులో ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వేగేటు సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన మాలేటిపాటి మల్లికార్జున్ (45) జిరాక్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని విజయ మహల్ రైల్వేగేటు ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శనివారం మధ్యాహ్నం దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి కారులో బయల్దేరారు. 3.30గంటల సమయంలో గొలగమూడి రైల్వేగేటు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు. ముందే తెచ్చుకున్న పెట్రోలును కారుపై పోసి.. లోపలికి వెళ్లి కూర్చుని తనపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కారులో మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారు రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా మల్లికార్జున్‌గా గుర్తించి.. ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు ఘటనాస్థలికి తీసుకొచ్చారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ఎముకలు, మాంసపుముద్ద మాత్రమే మిగిలింది. కుటుంబ సభ్యులు ప్రాథమికంగా మల్లికార్జున్‌గా గుర్తించారు. మధ్యాహ్నం ఫోన్ చేస్తే బయట ఉన్నా.. ఇంటికి వస్తున్నట్లు చెప్పారని.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపారు.







