UPDATED 17th JUNE 2017 SATURDAY 4:00 PM
పెద్దాపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చి దిద్దనున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్నివసతులు కల్పించడం జరుగుతోందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ అత్యాధునిక ఫర్నిచర్, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు మొదలైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం తొమ్మిదవ తరగతి బాలికలకు సైకిళ్ళను ఆయన చేతుల మీదుగా అందచేశారు. అలాగే దివిలి జంక్షన్ లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారిని విస్తరించడం జరుగుతుందని, అందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులు సహకరించాలన్నారు. అలాగే పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న ఒకటవ వార్డ్ లో రూ. 4.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన సామాజిక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట మార్కెట్ కమిటీ చైర్మన్లు ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), పాలకుర్తి శ్రీనివాసాచార్యులు ( శ్రీనుబాబు), గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, పట్టణ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, ఒకటవ వార్డ్ కౌన్సిలర్ ఎ. వెంకటలక్ష్మి, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు పాల్గొన్నారు.







