Konaseema Thirumala Vadapalli : వాడపల్లి వెంకన్నకు తిరుప్పావడ సేవ

UPDATED 20th OCTOBER 2022 FRIDAY 10:00 PM

▪️ వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ప్రధాన హోమాలు, అభిషేకాలు

▪️ రాజాధిరాజ అలంకరణతో
గజ వాహనంపై విహరించిన శ్రీవారు

వాడపల్లిలో వెంకన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఏడో రోజైన గురువారం వాహన సేవల్లో భాగంగా స్వామివారు గజ వాహనంపై విహరించారు.

Konaseema Thirumala Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దశమవార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం వసంత మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్ట కలశారాధన, వసంతోత్సవం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పంను వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ ధర్మకర్తలు మెర్ల వెంకటేశ్వరరావు, ఏపుగంటి కనకారావు దంపతులు హోమాలు, పూజల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే సంకల్పంతో తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి అంతరాలయంలో తెల్లని వస్త్రం పరిచి పులిహోర, గారెలు, వివిధ కూరగాయలతో స్వామివారి రూపాన్ని రూపొందించి తిరుప్పావడ సేవను కన్నుల పండువగా జరిపారు.

అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. రాత్రి 8.30 గంటలకు శ్రీవారు స్వర్ణశోభితుడై పుష్పాలతో రాజాధిరాజ అలంకరణలో గజ వాహనంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో విహరించారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన భల్లే భల్లే డ్రమ్స్‌తో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

దేవదాయ శాఖ ఆర్జేసీ ఎంవీ సురేష్‌బాబు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులతో పాటు ధర్మకర్తలు పి.సురేష్‌రాజు, మన్యం సూర్యకుమారిభాను పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us