ఆధ్యాత్మికతకు ఆచరణ మార్గం రంజాన్‌

UPDATED 27th MAY 2017 SATURDAY 11:00 AM

REDBEENEWS: ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు నిర్వహించే అతి పెద్ద పండుగ, పవిత్రమైన రంజాన్‌ మాస శుభగడియలు సమీపించాయి. ప్రతి ముస్లిం 5 ప్రాథమిక విధుల ద్వారా ఇస్లాంలో ముందుకు పయనిస్తారు. కలిమా చదవటం, ప్రతిరోజూ 5 పూటలా నమాజ్‌ చేయటం, రంజాన్‌ నెలలో ఉపవాసం ఉండటం, తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయటం (జకాత్‌), హజ్‌ చేయటం ఈ విధులు. వీటిల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఉపవాసాల నెలే రంజాన్‌. నెల రోజుల ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింప చేయటం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందన్నది ముస్లిం సోదరుల విశ్వాసం. పవిత్ర ఖుర్‌ఆన్‌ ప్రకారం ప్రతి ముస్లిం రంజాన్‌ నెలలో ఉపవాసం ఉండటం విధి. ప్రాపంచిక విషయాలపై అవగాహన కలిగిన పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీనిని తప్పనిసరిగా పాటించాలి. పూర్తి అనారోగ్యవంతులు, బాలింతలు, నెలసరిలో ఉన్న మహిళలు, గర్భిణులకు మినహాయింపు ఉంది. అయితే వారు కూడా తమ, తమ సమస్యలు తీరిన తర్వాత ఖజా ఉపవాసాలు ఉండాలి. అరబిక్‌ భాషలో రమ్జ్‌ అంటే కాలడం అని అర్థం. అంటే ఉపవాసంతో శరీరాన్ని శుద్ధి చేసుకోవటం, ఆకలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటం, అల్లాహ్‌పై పూర్తి భక్తిని ప్రదర్శించి ఆత్మ ప్రక్షాళన చేసుకోవటం అన్న విషయాలు ఈ రమ్జ్‌కు మూలం. ఉపవాసం సందర్భంగా శరీరాన్ని, మనస్సును పవిత్రంగా ఉంచుకుని ఉదయం సూర్యోదయం లోపల, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవటం ప్రధాన విషయం. ఉపవాసం ఆచరిస్తున్న సమయంలో అసత్యం పలకరాదు, అధర్మంగా ప్రవర్తించరాదు, ప్రాపంచిక విషయాలపై కంటె దైవ కార్యక్రమాల్లో అధికంగా ఆసక్తి చూపించటం, పవిత్ర ఖురాన్ పఠనంలో ఎక్కువ సమయం గడపటం చేయాలి. ఇటువంటి నిబద్ధత కలిగిన ప్రవర్తనతో కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలు నియంత్రణలో ఉండి, మనోనిగ్రహం ఏర్పడుతుంది.. దైవంపై ప్రేమ అధికమవుతుంది..తదుపరి జీవితానికి ఈ నెల ఒక ‘శిక్షణ’గా ఉపయోగపడుతుంది. రంజాన్‌ నెల ప్రధాన ధ్యేయం ఇదే. దానం చేయగలిగిన స్థితిలో ఉన్న ప్రతి ముస్లిం తన మిగులు సంపాదనలో 2.5% పేదవారికి పంచిపెట్టటమే జకాత్‌. ధన వ్యామోహాన్ని దూరం చేయటం, పేద వారు కూడా పండుగను సంతోషంగా చేసుకోవటానికే అల్లాహ్‌ జకాత్‌ను తప్పనిసరి చేశారు. ఇది ఏటా కొనసాగాలి. అప్పుడే పుట్టిన బిడ్డతో సహా అందరూ ఫిత్రాను పేదవారికి ఇవ్వాలి. 1750 గ్రాముల గోధుములు కాని, అందుకు సమానమైన నగదు కాని ఫిత్రా రూపంలో ఇవ్వవచ్చు. సాధారణంగా రంజాన్‌ నెల ఉపవాస దీక్షలు ముగియటానికి ముందే ఈ దాన కార్యక్రమాలు పూర్తి చేయాలని పెద్దలు ఉపదేశిస్తారు. ఎందుకంటె ఈనెలలో చేసిన పుణ్యకార్యాలకు 70 రెట్లు అదనంగా పుణ్యఫలం దక్కుతుంది. రంజాన్‌ నెలలో మరో పవిత్ర అంశం ఎతికాఫ్‌. అంటే ఈ నెలలో చివరి పది రోజులు కుటుంబాన్ని తాత్కాలికంగా వదిలి మసీదుల్లో దైవ ప్రార్థనలో గడపటమే ఎతికాఫ్‌. ఎతికాఫ్‌ చేసిన వారికి, వారివల్ల మొత్తం సమాజానికి అధిక పుణ్యఫలం దక్కుతుందని పవిత్ర ఖురాన్ చెబుతుంది. పవిత్ర ఖురాన్ ప్రకారం అతి పవిత్రమైన లైలతుల్‌ఖద్ర్‌ ఈ నెలలోనే వస్తుంది. రంజాన్‌ నెలలోని 27వ రోజు రాత్రిని పుణ్యరాత్రిగా పరిగణిస్తారు. ఆ రాత్రి జాగారం ఉండి, దైవ ప్రార్థనలో గడుపుతారు. నెల రోజుల పాటు చదివిన ఖురాన్  చివరి అంకాన్ని ఈ రాత్రి ముగిస్తారు. అల్లాహ్‌ కృప కోసం ప్రత్యేకంగా దువా చేస్తారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం నెలలో 31వ రోజు ఉండదు. 30వ రోజు కూడా ఆరు నెలలే ఉంటుంది. అందువల్లనే ఏటా రంజాన్‌ నెల పది రోజులు ముందుకు జరుగుతూ వస్తుంది. గత ఏడాది జూన్‌ 7న ప్రారంభమైన రంజాన్‌ నెల ఈ ఏడాది మే 27న ప్రారంభమైంది. సర్వశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్‌ మానవ జాతికి దివ్య ఖురాన్  అందించి నెల అయిన రంజాన్‌ కోసం ముస్లిం సోదరులు సర్వం సన్నద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా మసీదులకు రంగులు వేయటం, విద్యుత్‌ దీపాలతో అలకరించటం పూర్తయ్యాయి. మానవ జాతికి శాంతి సందేశాన్ని ఇచ్చిన పవిత్ర రంజాన్‌ నెల అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us