Updated 9th December 2022 Friday 12:30 pm
Cyclone Mandous: తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా మాండౌస్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం తెల్లవారు జామున తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మాండౌస్ తుపాను కర్తెకల్, చెన్నైకి 270 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరందాటే సమయంలో 65 నుంచి 85 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాలపై తీవ్రప్రభావం చూపనుంది. ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
మాండౌస్ తుపాను కారణంగా కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అంతర్వేది, ఓడల రేవు తీరాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డుపై సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ సుమారు పది మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తుపాను ప్రభావంతో శుక్రవారం తెల్లవారు జామునుంచి భారీ ఈదురుగాలలు వీస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలో 210 మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకోసం మొత్తం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాకు రెండు, నెల్లూరుకు మూడు, తిరుపతికి రెండు, చిత్తూరుకు రెండు సహాయ బృందాలను అధికారులు కేటాయించారు.







