* హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* తిరుపతి నుంచి ఉల్లాసంగా సాగిన సైకిల్ యాత్ర
* యాత్రలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తోట నరసింహం
UPDATED 21st APRIL 2018 SATURDAY 8:00 PM
పెద్దాపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే టిడిపి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా పార్టీ పిలుపు మేరకు మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో కాకినాడ ఎంపి తోట నరసింహంతో కలిసి మంత్రి శనివారం పాల్గొన్నారు. ముందుగా శృంగారవల్లభ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 200 సైకిళ్లపై కార్యకర్తలతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర తిరుపతి, చదలాడ, చంద్రమాంపల్లి, దివిలి, తాటిపర్తి గ్రామాల మీదుగా ఉత్సాహంగా సాగింది. అనంతరం హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన పోరాటానికి సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ,విదేశాల్లో సైతం కోట్లాది మంది తెలుగు ప్రజలు మద్దత్తును ఇస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉన్న కేంద్రం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకే నిధులను కేటాయిస్తోందే తప్ప లోటు ఉండే రాష్ట్రాలకు నిధులను మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి సహకరించాల్సింది పోయి కేంద్రంతో చేతులు కలిపి ప్రత్యేక హోదా దక్కకుండా కుయుక్తులతో కుట్రకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ కేంద్రాన్ని ఎదిరించే దమ్ము కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే ఉందని, విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చేవరకూ పోరాటం ఆగదన్నారు. కనీసం ప్రత్యేక ప్యాకేజీకి కూడా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), జడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, సర్పంచ్ మెయిళ్ల కృష్ణమూర్తి, శృంగారవల్లభస్వామి దేవస్థానం చైర్మన్ బందిలి సుబ్రహ్మశ్వేశ్వర రావు, బొడ్డు వెంకన్న, దేవళ్ల వర ప్రసాద్ (బోసు), అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.







