చెన్నై (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు దూరదర్శన్ న్యూస్ వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది. 80శాతం కాలిన గాయాలతో ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీఎఫ్ హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.







