Konaseema Thirumala Vadapalli : వైభవంగా మహా పుష్పయాగం

UPDATED 16th OCTOBER 2022 SUNDAY 06:00 AM

Konaseema Thirumala Vadapalli: వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ బహుళ షష్ఠి రెండో రోజు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శ్రీవారు హంస వాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు. స్వామివారి వసంత మండపంలో ఉదయం 9.01 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్తకలశారాధన, అభిషేకములు, ప్రధాన హోమాలను వేద పండితులు ఘనంగా నిర్వ హించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన 16 రకాల పుష్పాలతో మహాపుష్పయాగం నిర్వహించారు. దాత ఎంఎస్‌ఆర్‌ దంపతుల ఆధ్వర్యంలో కనుల పండువగా జరిగింది. ఖండవల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు బ్రహ్మ త్వంలో వేద పండితులు, అర్చకులు బ్రహ్మోత్సవ పూజా కైంకర్యాలను నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు స్వస్తి వచనం, ప్రధాన హోమాలు, సహస్ర దీపాలంకరణ సేవ, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పం నిర్వ హించారు. వసంత మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో మహాపుష్పయాగం నిర్వహించారు.

26 రకాల పండ్లను స్వామివారికి నివేదించారు. కేరళ వాయిద్యాలు, తప్పెటగుళ్లు, తంబోలా వాయిద్యం, డోలుసన్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంప తులతో పాటు ధర్మ కర్తలు పి.సురేష్‌ రాజు, మన్యం సూర్య కుమారిభాను, మెర్ల వెంకటేశ్వర్లు, ఏపుగంటి కనకారావు, శనగన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హంస వాహనంపై శ్రీవారు..

రాత్రి 9 గంటలకు సరస్వతీ అలంకరణతో హంస వాహనంపై శ్రీవారిని ముస్తాబు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి హంస వాహనసేవలో పాల్గొని తన్మయత్వం పొందారు. జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తన కుమారుడితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆదాయం రూ.13.50 లక్షలు.. వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని తలనీలాలు, కానుకలు సమర్పించుకుని గోవిందనామ స్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us