UPDATED 1st NOVEMBER 2017 WEDNESDAY 5:00 PM
మండపేట : పదిమందిక సహాయపడాలని లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో గల ఇనపకోళ్ల శ్రీనివాస్ దుర్గాప్రసాద్ ఫౌండేషన్ (ఐ ఎస్ డి) సేవలు ఎందరికో ఆదర్శమని జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా పేర్కొన్నారు. స్థానిక సీతారామా కమ్యూనిటీ హాల్లో ఐ ఎస్ డీ ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులకు ఇచ్చే ఉపకార వేతనాలను ఆయన చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐ ఎస్ ఎన్ ( ఇనపకోళ్ల సత్యనారాయణ) అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, విశిష్ఠ అతిథిలుగా స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ సమాజంలో పదిమందికి సహాయపడాలనుకునే మనస్తతత్వం అభినందనీయమన్నారు. కష్టపడి తాము సంపాదించుకున్న దాని నుంచి పరులకు సహాయపడేవారే నిజమైన హీరోలని స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఉపకారవేతనాలు అందుకొంటున్న విద్యార్ధులు ఫౌండేషన్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ మండపేటకు ఐదు అవార్డులు వచ్చాయని, ఇందులో ప్రజా ప్రతినిధులతోపాటు అధికారుల కృషి ఎంతో ఉందన్నారు. దీనికి తోడు మరెందరో అవార్డులు రావడానికి కారణమైతే ఐఎస్ ఎన్ పరోక్షంగా అవార్డు దక్కడానికి కారణమయ్యారని కొనియాడారు. విజయలక్ష్మినగర్ కు అవార్డు వచ్చిందంటే అందులో ఐ ఎస్ ఎన్ కృషి ఎంతో ఉందన్నారు. అలాగే మరో అవార్డు వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణకు వస్తే అక్కడ ధర్మకర్తల మండలి సభ్యుల వెన్నంటి ఉన్న ఐ ఎస్ ఎన్ కారణమయ్యారని ప్రశంసించారు. విద్యార్ధులు ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యార్ధులు 18 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.80 లక్షలు, డిగ్రీ విద్యార్ధులు 27 మందికి రూ. 3.15 లక్షలు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. సుబ్బారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, టిడిపి జిల్లా ఉపాథ్యక్షులు వి. సాయికుమార్ బాబు, తహసీల్దారు మేకా వెంకటేశ్వర్లు, కమీషనరు కన్యాకుమారి, పోతంశెట్టి సత్తిబాబు, వంకా సత్యబాబు, ఇనపకోళ్ల గణేశ్ చౌదరి, వల్లూరి చిన్నారావు, కాశిన కాశీ విశ్వనాథం, చింతా లక్ష్మీనారాయణ, వల్లూరి వీరబాబు, రెడ్డి చినప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







