హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఇకపై నేరుగా కస్టమర్ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నాయి. గతంలో జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూలు చేసేవి. జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే, వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదు. ఎందుకంటే..? మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు ఆహారానికి గానూ గతంలో రెస్టారెంట్లు ఐదు శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు గానూ కొంతమొత్తం వినియోగదారుల నుంచి వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపులేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనివల్ల ఇప్పటి వరకు పన్ను చెల్లించని రెస్టారెంట్లు పన్ను పరిధిలోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల వినియోగదారుడికి ఎలాంటి నష్టం వాటిల్లబోదు. సెప్టెంబర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గుర్తింపులేని రెస్టారెంట్లు పన్ను పరిధిలో లేకపోవడం వల్ల గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని కేంద్రం అప్పట్లోనే ప్రకటించింది.







