UPDATED 12th AUGUST 2017 SATURDAY 5:00 PM
కాకినాడ : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఈనెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. సీఎం పర్యటనపై ఎస్పీ విశాల్‌గున్ని, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి, ఇతర అధికారులతో కలిసి శనివారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతి నుంచి సీఎం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి సీతానగరం వెళతారన్నారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గాన పురుషోత్తపట్నం చేరుకుని ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తర్వాత నాగులాపల్లి చేరుకుని పైపుల ద్వారా పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసే ప్రదేశాన్ని పరిశీలిస్తారన్నారు. అనంతరం జగ్గంపేటలో రైతులనుద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం రైతు రథం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారని తెలిపారు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు వైద్య సదుపాయాల కోసం ఆరు అంబులెన్స్‌లను సీఎం ప్రారంభిస్తారన్నారు. పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్ విజయరామరాజు, శిక్షణ కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, డీఆర్వో జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.







