హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలింపును అడ్డుకోవాలని కోరుతూ 132 మంది విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు లేఖ రాశారు. కళాశాలను అక్కడి నుంచి దూరంగా తరలించి.. ఆ భూమిని కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పుడున్న ప్రాంతం నుంచి కళాశాలను దూరంగా తరలిస్తే ప్రయాణానికి ఇబ్బంది పడుతామన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నారని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు రాసిన లేఖను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఇప్పుడున్న ప్రాంతం నుంచి ఐటీఐ కళాశాలను తరలిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రయాణ ఛార్జీలు భరించలేరని.. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా కోల్పోతారని పేర్కొంది. పూర్తి వివరాలతో 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది.







