అంకితభావంతో వైద్య సిబ్బంది విధులు నిర్వహించాలి

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య 

UPDATED 22nd JUNE 2020 MONDAY 7:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ వైద్య సేవల పట్ల గిరిజనులలో విశ్వసనీయతను పెంపొందించేందుకు చిత్తశుద్ధి, అంకితభావంతో వైద్య సిబ్బంది పనిచేయాలని ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య  పేర్కొన్నారు. మలేరియా నియంత్రణ చర్యల పురోగతిపై స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయంలో మలేరియా సిబ్బంది, డివిజనల్ పంచాయితీ అధికారితో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితులలో గిరిజనులకు అండగా నిలుస్తూ వైద్య సేవల పట్ల భరోసా కల్పించడం ద్వారా వారికి వైద్య సేవలపై నమ్మకం పెంపొందుతుందని, ఆదిశగా వైద్య సిబ్బంది మెలగాలని అన్నారు. మలేరియా వ్యాధిగ్రస్తులు ఆధునిక వైద్యంతో పాటుగా పౌష్టికాహారాన్ని పొందాలన్నారు. గిరిజన ప్రాంతాలలో దోమల నివారణకై సిబ్బంది పంచాయితీ కార్యదర్శులు సహకారంతో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వర్షాకాలంలో మురుగునీటి కుంటలను గుర్తించి దోమలను లార్వాదశలోనే సమూలంగా నిర్మూలించేందుకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలని, మలేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఫోకల్ పిచికారీ, ఫాగింగ్ కార్యకలాపాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ వైద్యులు వద్దకు వచ్చే  మలేరియా పాజిటివ్ కేసుల వివరాలు సేకరించి గణాంకాలు రూపొందించి సమర్పించాలని సబ్ యూనిట్ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వైద్యులు సమాచారం ఇవ్వని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో డయోగ్నోసిస్ ల్యాబ్ లో కూడా పాజిటివ్ కేసులు సమాచారాన్ని సబ్-యూనిట్ అధికారులు తీసుకొని గణాంకాలు రూపొందించాల్సి ఉంటుందని, మలేరియా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు బలోపేతం గావించాలని ఆదేశించారు. గిరిజనులు మూఢ నమ్మకాలు పేరిట నాటువైద్యం, చెక్కమందులను ఆశ్రయించకుండా అల్లోపతి వైద్య సేవలపట్ల వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు. రాబోయే రెండునెలలు మలేరియా వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉందని, పారిశుధ్య పనులు ఆయా పంచాయితీ కార్యదర్శులు ద్వారా పక్కాగా చేపట్టాలని డివిజనల్ పంచాయితీ అధికారిని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంవో పివి సత్యనారాయణ, డిఎల్ పీవో హరి, సబ్-యూనిట్ అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us