UPDATED 14th SEPTEMBER 2022 WEDNESDAY 06:00 AM
WhatsApp : వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను యూజర్లకు పరిచయం చేయనుంది. చాట్ పేజీలో అవసరమైన మెసేజ్ లను సులువుగా వెతికేందుకు వీలుగా కొత్త సెర్చ్ ఆప్షన్ ను తీసుకురానుంది. ప్రస్తుతం టెక్స్ట్ సెర్చ్ చేసినట్లుగా, ఇకపై యూజర్లు డేట్ తో సెర్చ్ చేయొచ్చు. దీంతో యూజర్లు తేదీల వారిగా వచ్చిన మెసేజ్ లను ఫిల్టర్ చేసి చూడొచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లకు సెర్చ్ బార్ పై క్లిక్ చేస్తే క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో తేదీపై టాప్ చేస్తే ఆ రోజు వచ్చిన మెసేజ్ లు చాట్ పేజీలో కనిపిస్తాయి. అలా కిందకు స్క్రోల్ చేస్తూ తర్వాతి, ముందు రోజు మెసేజ్ ను కూడా యూజర్ చూడొచ్చు. దీనివల్ల యూజర్ ఏ రోజు ఏయే మెసేజ్ ను పంపారనే వివరాలతో పాటు, మెసేజ్ సెర్చింగ్ సులువుగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో యూజర్లకు పరిచయం చేయనుంది. డేట్ సెర్చ్ ఫీచర్ తోపాటు 'వాట్సాప్ సర్వే' పేరుతో మరో కొత్త ఫీచర్ కూడా యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వాట్సాప్ ఫీచర్లు, సర్వీస్ గురించి యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. యాప్ వినియోగం గురించి తమ అభిప్రాయాలు తెలియజేయమని కోరుతూ వాట్సాప్ తన వెరిఫైడ్ ఖాతా నుంచి యూజర్లకు ఇన్విటేషన్ పంపుతుంది. దాన్ని ఓపెన్ చేసి యూజర్లు సర్వేలో పాల్గొంటూ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయొచ్చు. ఒకవేళ సర్వేలో పాల్గొనకూడదనుకుంటే వాట్సాప్ పంపిన ఇన్విటేషన్ ను రిజెక్ట్ చేస్తే సరిపోతుంది.







