తిరుమల (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం జరిగిన సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణంతో సప్తగిరులు పులకించాయి. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాల పారాయణం జరిగింది. ఎస్వీ వేదపాఠశాల ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గీతా పారాయణం జరిగే చోట శ్రీ మహావిష్ణువు, సమస్తతీర్థాలు, ముక్కోటి దేవతలు, మహర్షులు కొలువై ఉంటారని చెప్పారు. అఖండ పారాయణంలో ఆచార్య కాశీపతి సోమయాజులు, కుప్పా నరసింహశర్మ, డాక్టర్ పీవీఎస్ మారుతీ శ్లోకాలను పారాయణం చేశారు. కుప్పా విశ్వనాథ శర్మ ఫలశృతిని వివరించారు. పారాయణంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య వి.మురళీధర్ శర్మ, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్ వీజీవో బాలిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.







