Updated 22nd February 2023 Wednesday 5:10 pm
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రజల తరపున గళం వినిపిస్తున్న బడుగు, బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే గన్నవరంలో హింస జరిగిందని చెప్పారు. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమేనని అన్నారు.
ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సమష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామని అన్నారు. మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు, ప్రతి పక్షాలు ప్రశ్నించకుండా చేయడానికే హింసను ప్రేరేపిస్తున్నారని తెలిపారు. జగన్ రాజకీయ కక్ష సాధింపులో పోలీసులు పావుల్లా మారుతున్నారని అన్నారు.
శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, తన వికృత రాజకీయానికి జగన్ వారిని పావులుగా వాడుకున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వ్యక్తిగతంగా కేసు పెట్టేందుకు అర్హత లేకపోయినప్పటికీ.. క్రిస్టియన్ అయిన గన్నవరం సీఐ కనకారావుతో అట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ద్వారా తప్పుడు కేసులు ఏ స్థాయిలో పెడుతున్నారో అర్థం అవుతుందని అన్నారు.
గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా… ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ధి స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ప్రజల నుంచి రూ.1,100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ధి స్కాంలో ఇతను నిందితుడని తెలిపారు. గన్నవరం ఘటనలో బాధితులైన తెలుగు దేశం వారినే నిందితులుగా చేయడం దారుణమని అన్నారు







