UPDATED 28th JULY 2017 FRIDAY 10:30 PM
రాజమహేంద్రవరం: ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో సుమారు రూ.3.2 కోట్ల నిధులతో ప్రజోపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అసెట్ మేనేజర్ డి.ఎం.ఆర్.శేఖర్ తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద స్వచ్ఛగోదావరి కార్యక్రమానికి సంస్థ శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 50 ఎకరాల భూముల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామని, నగరపాలక సంస్థ సహకారంతో స్వచ్ఛ రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నాటికి స్వచ్ఛ భారతదేశం సాధించడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సంస్థల కృషి అభినందనీయమన్నారు. మున్సిపల్ కమిషనర్ విజయరామ్‌రాజు మాట్లాడుతూ గత సంవత్సరం దేశవ్యాప్తంగా స్వచ్ఛసర్వేక్షణ్ సర్వే నిర్వహించగా రాజమహేంద్రవరం 46వ స్థానంలో నిలిచిందని, మరిన్ని సంస్థలు ముందుకొస్తే ఇంకా మంచి స్థానాన్ని పొందవచ్చని, దీనికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని తెలిపారు. వీటితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యావరణహిత సామూహిక సులభ్ కాంప్లెక్స్‌లను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం స్వచ్ఛ రాజమహేంద్రవరంకు సంబంధించిన ఒప్పంద పత్రాలను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ అధికారులు పరస్పరం మార్చుకున్నారు. అలాగే పచ్చదనంలో భాగంగా మొక్కలను పంపిణీ చేసి, స్వచ్ఛభారత్ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు నిర్వహించిన స్వచ్ఛభారత్ నాటిక, చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మున్సిపల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ అధికారులు, కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







