అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి పండిస్తే వచ్చే ఆదాయం.. చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చేలా చూడాలి. దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరుధాన్యాల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వాటిని అధికంగా పండించే ప్రాంతాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా చూడాలని సూచించారు. ‘ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రం) యూనిట్‌గా.. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వాటిలో ఏర్పాటు చేసే అద్దె యంత్ర కేంద్రాల్లో సేంద్రియ సాగుకు పనికొచ్చే పరికరాలు ఉంచాలి’ అని పేర్కొన్నారు.







