రెడ్ బీ న్యూస్,17 డిసెంబర్ 2021: బన్నీపై నాకున్న ప్రేమని ‘పుష్ప’లో చూస్తారు బన్నీపై నాకున్న ప్రేమని ‘పుష్ప’లో చూస్తారు ఒక దర్శకుడు హీరోని ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఇందులో చూస్తారన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప’. రష్మిక నాయిక. సుకుమార్ దర్శకత్వం వహించారు. ముత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘సుకుమార్‌కి నామీద ఉన్న ప్రేమని చూపించే అవకాశం ఈ సినిమాతో వచ్చిందనుకుంటున్నా. ఇంత ప్రేమ చూపించినందుకు తనకి కృతజ్ఞతలు. ‘పుష్ప’ విషయంలో తనని నేనేమీ అడగలేదు, ఈ 17న సినిమా కావాలి, హిట్ అనిపించుకోవాలి, నా నటన బాగుందనాలి అని మాత్రమే చెప్పా. ‘నువ్వు.. నేను వేరు కాదు, నీకు పేరొచ్చినా నాకు వచ్చినట్టే, నాకు వచ్చినా నీకు వచ్చినట్టే’ అన్నారు సుకుమార్. నిజంగా సినిమా చూశాక ‘ఒక కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయొచ్చా’ అని ఆశ్చర్యపోతారు. ఇందులో ఓ మేజిక్ ఉంది. అది కూడా క్లిక్ అయ్యిందంటే ప్రతీ దర్శకుడు సుకుమార్ దగ్గరికి వచ్చి పాఠాలు చెప్పించుకుంటారు. అది జరగకపోతే నా షర్ట్ విప్పేసి మైత్రీ ఆఫీస్‌లో తిరుగుతా. దేవిశ్రీప్రసాద్‌కీ, నాకూ ఇది మూడో దశాబ్దం. ఇలాగే మా ప్రయాణం కొనసాగాల’’న్నారు. రష్మిక మాట్లాడుతూ ‘‘మైత్రీ మూవీ మేకర్స్ మా అందరికీ సొంత సంస్థ లాంటిది. సుకమార్ సర్ నన్ను శ్రీవల్లిగా ఎలా చూశారో నాకే అర్థం కాలేదు. ఆయన అంచనాలకి తగ్గట్టుగా నటించానని నమ్ముతున్నా. బన్నీతో కలిసి నటించడం ఓ గొప్ప అవకాశంగా భావించా’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ ‘‘నా హృదయానికి దగ్గరైన వ్యక్తి బన్నీ. మేం ఇద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తుంటాం. అది ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. తనమీద ప్రేమంతా ఈ సినిమాలో కనిపిస్తుందేమో. ప్రేక్షకులు ఆస్వాదిస్తారని నమ్ముతున్నా. ‘పుష్ప’ మలిభాగం చూడాలన్న ఆసక్తిని కలిగిస్తూ ఈ సినిమా ముగుస్తుంద’’న్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ, నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఛాయాగ్రాహకుడు క్యూబా తదితరులు పాల్గొన్నారు.







