సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని దోహదం

UPDATED 31st AUGUST 2018 FRIDAY 5:30 PM

అడ్డతీగల: గిరిజన గ్రామాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అర్హులైన లక్షిత  వర్గాలకు అందించడం, గ్రామ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా గ్రామదర్శిని-గ్రామవికాసం పేరిట గ్రామ పంచాయితీలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతోందని ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని గొండోలు గ్రామ పంచాయితీలో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివో నిషాంత్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో గల సమస్యల పరిష్కారానికి క్షేత్రసాయి అధికారులు చిత్తశుద్ది, అంకితభావం, శాఖలు పూర్తి సమస్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో  పర్యటించి పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యాలు పదిలంగా ఉంటాయని గ్రామస్తులకు సూచించారు. సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు సక్రమంగా అందేలా అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు అర్హతలకు అనుగుణంగా సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేస్తున్నామని, గ్రామంలో జనాభా అవసరాలకు అనుగుణంగా మరో బోరుబావి, ఓవరుహెడ్ ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 400 మీటర్లు మేర సిమ్మెంట్ కాంక్రీటు అంతర్గత రోడ్లు నిర్మాణానికి రూ. 10 లక్షలు కేటాయించడం జరుగుతుందని, దీనిలో ఒక లక్ష రూపాయిలు గ్రామపంచాయితీ వాటాగా చెల్లించాలని ఆయన సూచించారు. అర్హులైన వారందరికి గృహాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వైటిసిలలో పలు శిక్షణా కోర్సులు ఉన్నాయని, వాటిని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు నెలలపాటు నర్శింగ్ శిక్షణ కూడా ఉందని, నిరుద్యోగ యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హైదరాబాదు వంటి నగరాలలో నెలకు రూ.13 వేలు జీతం పొందేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఇకపై వేతనాలు చెల్లింపులలో జాప్యాలు ఉండవని, ప్రస్తుతం ఉన్న పెండింగులు త్వరలో పరిష్కారం చేస్తామన్నారు. శ్మశానవాటికకు స్థలం కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని, అలాగే బరియల్ గ్రౌండ్ మార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వి. మురళీకృష్ణను ఆయన ఆదేశించారు. అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తామని, ఒక కమ్యూనిటీ హాలును గ్రామస్థుల కోరిక మేరకు నిర్మించడం జరుగుతుందన్నారు. దీనిలో ఇ-సేవాకేంద్రం, బ్యాంకింగ్ వ్యవహారాలు, స్వయం సహాయక సంఘానికి మూడు గదులతోపాటు 70 మంది సౌకర్యవంతంగా కూర్చునే రీతిలో హాలును నిర్మించడం జరుగుతుందన్నారు. కొత్త డిఆర్ డిపోను మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రాజానగరంలో శిధిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని తొలగించి క్రొత్త భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం పాఠశాల నిర్వహణకు ప్రత్యామ్నాయంగా వసతిని కల్పించడానికి అన్నిచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో కె. బాపన్నదొర, ఎపిఎం దుర్గాప్రసాద్, ఎంపిటిసి కారులక్ష్మి, సర్పంచ్ నాగులాపల్లి రాఘవ, ఎన్జీవో బి. చంద్రమోహన్, ఇరిగేషన్ ఎఇలు ఝాన్సీ రేణుక, పంచాయితీ కార్యదర్శులు నరేంద్ర, కృష్ణ, రేఖ తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us